
telangana
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా, ఈ ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా కోర్టు తాత్కాలిక నిలుపుదల ఆదేశాలు జారీ చేసింది.
బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పలు పిటిషన్లపై గత కొన్ని రోజులుగా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం, కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తదుపరి విచారణను ఆరు వారాల తర్వాతకు వాయిదా వేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ కనీసం ఆరు వారాలపాటు నిలిచిపోనుంది. ఇకపై హైకోర్టు తుది తీర్పు ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ నిర్ణయమవుతుంది.
జీవో నంబర్ 9 విడుదలైన తర్వాతనే అనేక పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై నిన్న కోర్టు విచారణ జరిపి, నేటి వరకు వాయిదా వేసి చివరికి స్టే ఆదేశాలు జారీ చేసింది.






